భగవాన్ శ్రీ రమణమహర్షి కృత ఉపదేశ సారము

భగవాన్ రమణులు, మొదటగా ఈ ఉపదేశ సారాన్ని ‘ ఉపదేశ ఉందియార్ ‘ అనే పేరుతో 30 పద్యములలో తమిళములో రచన చేశారు. తరువాత రమణులే, దాని భావమును పూర్తిగా తీసుకుని, సంస్కృతములో స్వయముగా ముప్పై లలితవృత్త గీతములు గాను, తెలుగులో ముప్పై ద్విపదలుగానూ, మళయాలంలో ముప్పై చతుష్పాద గీతములుగానూ రచించిరి.

ఇప్పుడు మనం ఆ సంస్కృత గీతముల ద్వారా స్థాలీ పులాక న్యాయముగా, రమణుల అనుగ్రహంతో, రోజుకు కొన్ని, మననం చేసుకుందాం.

మొదటి మూడు శ్లోకములు భగవద్గీతలోని ‘ కర్మయోగం ‘ గుర్తుకు తీసుకుని వస్తాయి.

1 . కర్తృరాజ్ఞయా ప్రాప్యతే ఫలం /
కర్మ కిమ్ పరం ? కర్మ తజ్జడం //

మానవులకు మూడు వివేకములు సాధారణంగా భగవంతుడు యిస్తాడు. అవి, లౌకిక వివేకము, ధార్మిక వివేకము, శ్రవణ వివేకము.

భగవదాజ్ఞానుసారము, కర్మఫలము లభించును. కర్మ దైవము కాదు. ఆలోచనలు కర్మలో భాగములే. భగవదాజ్ఞానుసారము వచ్చిన కర్మము దైవమెలా అవుతుంది ? కాదు అని అర్ధము. కానీ మీమాంసకారులు, ‘ కర్మవలన ప్రాప్టించే శుభాశుభములకు ఈశ్వరునికి ముడిపెట్టకూడదు. చేసిన కర్మయే స్వతంత్రముగా అలాంటి శుభాశుభ ఫలితాలని యిస్తుంది. ‘ అని అంటూ వుంటారు.

ఇక్కడ రమణులు మీమాంసకారుల అభిప్రాయాన్ని ఖండిస్తూ, కర్మము జడమైనది కనుక శుభాశుభఫలములు యివ్వడంలో, దానికి స్వతంత్రత లేదు, జడముగా వున్నది పరమాత్మ ఎలా అవుతుందీ, కాదు కనుక, ఈశ్వరుడే కర్మల యొక్క శుభాశుభ ఫలితాలనిస్తూ, జగత్తును నియంత్రిస్తూ వున్నాడని అర్ధం చెబుతున్నారు.

2 . కృతిమహోదధౌ పతనకారణం /
ఫలమశాశ్వతం గతినిరోధకం //

చేసిన కర్మలు మంచివి అయినా, చెడ్డవి అయినా వాని శుభాశుభ ఫలితాలు అశాశ్వతములు. కర్మఫలములు అయిపోగానే, తిరిగి జీవుడు కర్మ సముద్రములో పడవేయబడతాడు. అందువలన అది శాశ్వతగతి అయిన మోక్షాన్ని నిరోధిస్తుంది.

జీవులు పుణ్యకర్మల చేసివుంటే, ఆఫలములు స్వర్గాదిలోకాలలో అనుభవించి, పాపకర్మల చేసి వుంటే, వాటి ఫలములు నరకాది లోకములలో అనుభవించి, ఆ అనుభవ వాసనలనే, రాబోయే జన్మలలో వాసనాబీజములుగా తెచ్చుకుంటూ, జనన మరణ చక్రంలో పడుతున్నారు.

‘ కాబట్టి ఫలాపేక్షతో చేసే కర్మలు సుఖ దుఃఖాలను యిస్తాయి కానీ, మోక్షమును ఈయజాలవు. జీవులను కర్మసముద్రము నుండి వొడ్డున పడవేయవు. ‘ అని భగవాన్ చెబుతున్నారు.

Author: go123

https://webtemplatesmonster.blogspot.in/