మనస్సులో రజోగుణం అధికంగా ఉన్నప్పుడు ఆ గుణం నిన్ను ప్రశాంతంగా ఒకచోట కూర్చోనివ్వదు.

Color Brands

శ్లో॥ అభ్యాసేఽప్య సమర్థోఽసి మత్కర్మ పరమోభవ।
మదర్థ మపి కర్మాణి కుర్వన్ సిద్ధి మవాప్స్యసి॥ (10)

తా॥ అభ్యాసం చెయ్యటానికి కూడా నీవు అసమర్థుడివైతే నాకు సంబంధించిన కర్మలలో నిమగ్నం కా! నా కొరకు కర్మలు చేస్తున్నప్పటికీ సిద్ధిని పొందుతావు.

వ్యాఖ్య:- మనస్సులో రజోగుణం అధికంగా ఉన్నప్పుడు ఆ గుణం నిన్ను ప్రశాంతంగా ఒకచోట కూర్చోనివ్వదు. అన్ని విషయాలను పట్టించుకుంటుంది మనస్సు. అన్నింటి మీదకు పరుగులు తీస్తుంది. కనుక అభ్యాసయోగం కూడా కష్టమే.
ఒకే పనిని నిరాశానిస్పృహలు చెందకుండా మళ్ళీ మళ్ళీ చెయ్యటమే అభ్యాసం. మానసిక పూజగాని, జపంగాని, ధ్యానం గాని, శ్రవణమననాలు గాని, శాస్త్రాధ్యయనం గాని, బ్రహ్మచింతన గాని ఇవన్నీ పట్టు వదలని విక్రమార్కునిలా ఎంతో పట్టుదలతో చేయాలి.
అలా చెయ్యాలంటే మనం సత్త్వగుణంలో ఉండాలి. మనస్సు ప్రశాంతంగా ఉండాలి.
అందువల్ల రజోగుణంలో ఉన్నవారికి ఇక్కడొక ఉపాయాన్ని తెలియజేశారు.
భగవత్పరమైన కర్మలు చేయండి అని. ఎప్పుడైతే భగవంతుని కొరకు, భగవత్సంబంధమైన పనులను చేస్తూ ఉంటామో అప్పుడు మనస్సు క్రమక్రమంగా భగవంతుని పైకి మరలుతుంది. భగవంతునిపై నిలుస్తుంది. అదే ప్రేమగా , భక్తిగా మారుతుంది. కనుక శారీరకమైన కర్మలు చేయాలి. అలా చేస్తే రజోగుణం క్రమక్రమంగా తగ్గిపోతుంది. భగవంతునిపై నిలుస్తుంది.
అందుకే చెబుతున్నారు దైవకార్యాలు, పండుగలు, పూజాపునస్కారాలు, యజ్ఞయాగాదులు, ఆధ్యాత్మిక సభలను ఏర్పాటు చేయటం, ఆధ్యాత్మిక గ్రంధాల ప్రచురణ, అమ్మకం, దేవాలయాల నిర్మాణం, మహాత్ముల సేవ, సత్సంగంలో పాల్గొనుట, పారాయణలు చేయుట, పరోపకారార్థం కొన్ని పనులు చేయుట , ఇవన్నీ శారీరక కర్మలు. వీటిని చేస్తూ ఉండటం వల్ల క్రమక్రమంగా ఆ పనులలో ప్రీతి ఏర్పడుతుంది.
వాటితో తాదాత్మ్యం వల్ల భగవంతుని యందు భక్తి ఏర్పడుతుంది. దానితో బాహ్యవిషయాల పట్ల ఆసక్తి తగ్గిపోతుంది. భగవంతునిపై ఇష్టం ఏర్పడుతుంది.
ఇలా భగవంతుని కొరకు చేసే శారీరక కర్మలే భగవత్ప్రీతికరమైన కర్మలు.
నిజంగా ఇవి భగవంతునికి ప్రీతి కల్గించటానికి చేస్తున్నామా? అంటే ఇప్పటివరకు భగవంతుడు కొరతలతో, అసంతృప్తితో జీవిస్తున్నాడా? బాధపడుతున్నాడా? అదేంలేదు. ఈ పనులేవీ ఆయనకు అవసరం లేదు. ఇవి లేకపోతే ఆయనకు బ్రతుకు భారం కాదు, ఇవన్నీ నిజంగా మనకు అవసరం, మన ఉన్నతికి అవసరం, మనలోని రజోగుణాన్ని తగ్గించుకొని, వాసనలు క్షయం చేసుకోవటానికి అవసరం.
ఇలా భగవత్ప్రీతికరమైన కర్మలు చేయుట వల్ల మనలోని పాపవాసనలు క్షయమై, పుణ్యవాసనలు ఏర్పడతాయి. దీనివల్ల మనస్సు శుద్ధమై, నిర్మలమై భగవంతుని యందు నిలుస్తుంది.
అలా భగవంతుని యందు చిత్తాన్ని నిలిపితే భగవంతుని అనుగ్రహం కలుగుతుంది, జ్ఞానం అంకురిస్తుంది. అందువల్ల అభ్యాసయోగం బాగా చేయవచ్చు.

–శ్రీమద్భగవద్గీత :12 వ అధ్యాయం : భక్తి యాగం

Author: go123

https://webtemplatesmonster.blogspot.in/

 

2 thoughts on “మనస్సులో రజోగుణం అధికంగా ఉన్నప్పుడు ఆ గుణం నిన్ను ప్రశాంతంగా ఒకచోట కూర్చోనివ్వదు.”

Comments are closed.