మహావైశాఖి విశిష్ట విశేషాలు

ఈరోజ వైశాఖ పౌర్ణమి నేడే శ్రీ మహావిష్ణువు దశావతారాలలో రెండవదైన శ్రీ కూర్మావతారం దాల్చినది, పరమేశ్వరుడు శరభావతారందాల్చినది, తెలుగు తొలి వాగ్గేయకారుడు -అన్నమాచార్య జయంతి, శాక్యముని గౌతమ బుద్ధుడు జన్మించినది, వైష్ణవ ఆళ్వారులలోని నమ్మాళ్వార్ వారులు జన్మించినది… ఈ మహత్తరమైనది, అత్యంత శక్తివంతమైన, అపారమహిమలు గల ఈ మహా వైశాఖి పర్వమునాడే.

గత చరిత్ర ను , మన పూర్వీకుల అనుభవాలను నెమరువేసుకుంటూ ఆనందం గా జీవితం గడపడానికే ఉత్సవాలు చేస్తూ ఉంటాము . సమాజానికి ఒక నిర్ధేశిత సందేశము ఇవ్వడానికి దినోత్సవాలు చేస్తూఉంటాం . సాంప్రదాయాలను కాపాడుకోవడం కోసం పండుగలు చేస్తాము . ఏది చేసినా ఎక్కడ చేసినా ప్రపంచ మానవాలి శ్రేయస్సు కోసమే నిర్ధేశించబడుతుంది .పుట్టిన రోజు, పెళ్లి రోజు, ఈ రోజుల్లో మనం ప్రత్యేకంగా వారి గురించి అలోచించి, వాళ్ళను కొనియాడి, మన బాధ్యతను గుర్తు చేసుకొంటాము.

ఆయా పర్వదినాలకు ఉండే ప్రాధాన్యత గురించి మనం చక్కగా తెలుసుకుని ఈనాడు ఆచరించవలసిన మన ఆచారాలను ఆచారించి ఆనందించి తరిద్దాం……

వైశాఖంలో పౌర్ణమి తిథికీ పురాణోక్త మహిమలే కాక, చారిత్రక ప్రాముఖ్యత ఉన్నాయి.

ఈ మాసమంతా మహిమాన్వితమైంది. అయినప్పటికీ, ప్రత్యేకించి పూర్ణిమకు ఒక వైశిష్ట్యం ఉంది. మాసశక్తి అంతా పూర్ణిమలో సారంగా, కేంద్రంగా ఉంటుంది.

అందుకే ఈ మాసమంతా సాధన చేయలేనివారు, ఈ ఒక్క రోజైనా నియమబద్ధంగా చేసే సాధనలు శీఘ్రంగానూ, పూర్ణంగానూ ఫలిస్తాయని శాస్త్రోక్తి.

‘మహావైశాఖి’ అని శాస్త్ర వ్యవహారం గల ఈ రోజు చేసే దానానికి విశేషప్రాధాన్యం ఉంటుంది. గ్రహదోషాలను తొలగించడానికి, అరిష్టాలను నివారించడానికి జలదానం, వస్త్రదానం, ఛత్ర పాదుకాదుల దానం కర్తవ్యాలని చెబుతారు. బాటసారులకు జలం, శీతల పానీయాలు భగవత్ప్రీతిగా సమర్పించినవారికి రోగహరణం, తాపనాశనం కలుగుతాయని పురాణాల మాట.

వైశాఖ పూర్ణిమ ఎన్నో విశేషాల ఉద్ధిష్టమైన తిథి.

ఈ పూర్ణిమ పరమ పవిత్రం

ఏ మాసంలో వైశాఖి పూర్ణిమ వస్తుందో ఆ మాసాన్ని వైశాఖ మాసమని అంటారు. మహా వైశాఖి చాలా విధాలుగా పవిత్రమైనది. ఈనాడు బుద్ధ జన్మ మహోత్సవమని నీలమత పురాణం చెబుతోంది. వైశాఖ శుద్ధ పూర్ణిమను మహా వైశాఖి అంటారు. విశాఖ అంటే కాంతిని వ్యాపింప చేసేది అని అర్థం. అటువంటి విశాఖ నక్షత్రంతో కూడిన పూర్ణిమకు వైశాఖి అని పేరు.
కుమారోద్భవం: తమిళులు ఈ పర్వాన్ని ‘వెయ్‍కాసి విశాఖ’ అంటారు. తమిళనాడులో ఈనాడు యమధర్మరాజు పూజలు అందుకుంటాడు. సుబ్రహ్మణ్యస్వామి విశాఖ పూర్ణిమ నాడే అవతరించినట్టు చెబుతారు. నమ్మాళ్వారు అనే వైష్ణవ స్వామి ఈ పూర్ణిమ నాడే పుట్టాడని చెబుతారు. వైశాఖ పూర్ణిమ నాడు సముద్ర స్నానం చేయాలి. ఈనాడు ధర్మరాజు ప్రీతిని కోరి నానావిధ దానాలు చేసే వారు విశేష ఫలాలను పొందుతారని అంటారు. మహా వైశాఖి పర్వదినాన మహాన•ధిలో స్నానం చేసి పురుషోత్తముడిని దర్శించుకుంటే కోటి జన్మలలోని పాపం పోతుందని ప్రతీతి. ఇంకా ఈనాడు సోమవార వ్రతం ఆచరిస్తారని చతుర్వర్గ చింతామణిలో ఉంది.

-:శరభ జయంతి:-

వైశాఖ శుద్ధ చతుర్దశి నాడు విష్ణువు నరసింహావతారం ఎత్తాడు. ఈ అవతారంలో హిరణ్యకశిపుని సంహరించిన తరువాత నృసింహునిలో ఆగ్రహం చల్లారలేదు. ఆ ఆగ్రహాగ్నికి లోకాలు గజగజలాడుతున్నాయి. అప్పుడు దేవతలు శివుని ప్రార్థించారు. శివుడు వైశాఖ పూర్ణిమ నాడు శరభావతారం ఎత్తాడు. కాబట్టి ఈనాడు శరభ జయంతి కూడా. శరభం ఎనిమిది కాళ్ల జంతువు. సింహాన్ని చంపగలిగే శక్తి కలది.

ఈ వైశాఖ పూర్ణిమ ‘జ్ఞానపూర్ణిమ’ అనీ స్పష్టమవుతోంది.

మందర పర్వతాన్ని ఉద్ధరించిన, ఆధారశక్తి స్వరూపంగా ఉపాసించే ఆదికూర్మం అవతరించిన పుణ్యతిథి ఈ పూర్ణిమేనని శాస్త్రాల కథనం.
శ్లో.మంధనాచల ధారణ హేతో, దేవాసుర పరిపాలవిభో!
కూర్మాకార శరీర నమో,
భక్తం తే పరిపాలయమామ్.!!

మహావిష్ణువు దశావతారాల్లో విశిష్ట ప్రయోజనాన్ని ఉద్దేశించినది కూర్మావతారం. పూర్వము దేవతలు దూర్వాసమహర్షి శాపముతొ దానవులచే జయించబడి రాజ్యాన్ని పోగొట్టుకొని అసురుల వేధింపులకు తాళలేక ఇంద్రాది దేవతలు బ్రహ్మతో కలిసి పురుషోత్తముని ప్రార్థించారు. కరుణాంతరంగుడైన శ్రీహరి అమృతోత్పాదన యత్నాన్ని సూచించాడు. ఆ మేరకు ఇంద్రుడు దానవులను కూడా సాగర మథనానికి అంగీకరింపజేశాడు.

దేవదానవులు మందరాన్ని కవ్వంగా తెచ్చి వాసుకిని తాడుగా చేసుకున్నారు. పాముకు విషం తలభాగంలో ఉంటుంది. అది మృత్యు స్వరూపం. రాక్షసులు తామసులు, తమస్సు పాపభూయిష్ఠం. దాన్ని అణచివేస్తేతప్ప లోకంలోనైనా, మనసులోనైనా ప్రకాశం కలగదు. అందుచేత శ్రీహరి రాక్షసుల్ని మృత్యుస్వరూపమైన వాసుకి ముఖంవద్ద నిలిపాడు.

మధనంలో- బరువుగా ఉండి కింద ఆధారం లేకపోవడంతో పర్వతం సముద్రంలో మునిగిపోయింది. అప్పటి శ్రీహరిలీల కూర్మావతారం. బ్రహ్మాండాన్ని తలపించే పరిమాణంలో సుందర కూర్మరూపంలో మహావిష్ణువు అవతరించాడు. పాలసముద్రంలో మునిగిపోయిన మందర పర్వతాన్ని పైకెత్తి తన కర్పరంపై నిలిపాడు.ఇది కూర్మావతార కధగా ప్రసిద్ధికెక్కినది . శ్రీహరి జంబూద్వీపంలో కూర్మరూపుడై, విశ్వరూపుడై ప్రకాశిస్తూ ఉంటాడని బ్రహ్మపురాణం చెబుతోంది.
జలంలో నివసించే కూర్మం తనకు గమన సంకల్పం కలిగినప్పుడు కరచరణాలు కదలిస్తుంది. సంకల్పరహితంగా ఉన్నప్పుడు నీట్లో స్తంభించి ఉంటుంది. అవసరం లేనప్పుడు ఇంద్రియాలను విషయ సుఖాలనుంచి మరల్చగలగడమనే స్థితప్రజ్ఞకు, బహిర్ముఖ ప్రవృత్తి నిలుపుచేసికొని అంతర్ముఖ ప్రవృత్తిలోనికి వెళ్ళగలిగే చిత్తవృత్తికి కూర్మం ప్రతీక.

మంగళకరమైన సంపద్గౌరీదేవిని ఆరాధించే పూర్ణతిథి ఇది. ఇలా వ్రతపర్వంగా, దానస్నానపర్వంగా, సాధనల పండుగగా ప్రసిద్ధిచెందిన వైశాఖపూర్ణిమ ఆధ్యాత్మిక పూర్ణత్వానికి సంకేతం.

భగవంతుని చేరే నవవిధ భక్తి మార్గాల్లో ‘కీర్తనం’ ప్రధానమైనది. నామ సంకీర్తనంతో సర్వపాపాలు తొలగిపోతాయని భాగవతంలో వ్యాసుడు చెప్పిన విధం మనకు తెలిసినదే! తన సంకీర్తనలతో శ్రీనివాసునికి పదపుష్పాలతో పట్టాభిషేకం చేసిన కారణజన్ముడు తాళ్ళపాక అన్నమయ్య జన్మించినది ఈ వైశాఖ పూర్ణిమ పర్వదినమే.
తెలుగువారికి, తెలుగు జాతికి అచ్చ తెలుగులో పాట పాడుకునే యోగ్యత కల్పించినవాడు అన్నమయ్య. సాక్షాత్తు శ్రీహరి ఖడ్గమైన ‘నందకాంశ’తో జన్మించాడనే ఘనతను కలిగిన ఆ శ్రీహరి దాసుడు 32,000 అద్భుత సంకీర్తనలను తేట తెలుగులో, ప్రౌఢ సంస్కృతంలో రచించిన ఈయన క్రీ.శ.1424 లో జన్మించి 79 ఏళ్ళు జీవించి 1503 లో శ్రీ వెంకటేశ్వర సాయుజ్యాన్ని పొందిన మహా భక్త శిఖామణి అన్నమాచార్యుల వారు . కడప జిల్లా తాళ్ళ పాకలో జన్మించిన కారణ జన్ముడు. అన్నమయ్య జయంతి వైశాఖ పౌర్ణమి నాడు దేశ వ్యాప్తం గా జరుపు కోవటం పరంపర గా వస్తోంది .

గౌతమబుద్ధ జయంతి: దశావతారాల్లో సంబంధంలేని గౌతమ బుద్ధుడు జన్మించినది ఈనాడే. ఈ గౌతమ బుద్ధుని జీవితకాలంలో వైశాఖ పూర్ణిమ మూడుసార్లు అత్యంత ప్రాముఖ్యాన్ని వహించింది.

1. ఒకానొక వైశాఖ పూర్ణిమ నాడు బుద్ధుడు లుంబినివనంలో
సాలవృక్ష ఛాయలలో జన్మించాడు.
2. మరో వైశాఖ పూర్ణిమ నాడు గయలో మర్రిచెట్టు కింద జ్ఞానబోధ కలిగి బుద్ధుడు అయ్యాడు.
3. ఇంకో వైశాఖ పూర్ణిమ నాడు కుసినరలో సాల వృక్షాల కింద బుద్ధుడు నిర్యాణం చెందాడు.
బుద్ధుని జీవితంలో ఇవి ముఖ్య ఘట్టాలు. ఈ మూడు ముఖ్య ఘట్టాల్లో ప్రదేశాలు మారాయి. చెట్లు మారాయి. తిథి మాత్రం మారలేదు. అందుచేత వైశాఖ పూర్ణిమ బౌద్ధులకు మహా పర్వమై ఉంది. వైశాఖ పూర్ణిమ నాడు బోధి వృక్షానికి పూజ చేసే ఆచారం బుద్ధుని జీవితకాలంలోనే ప్రారంభమైంది.

Author: go123

https://webtemplatesmonster.blogspot.in/