మాయ అంటే ఏమిటి?

మాయా ఎవరికో ముందుగా విచారించండి. అప్పుడే మాయ అదృశ్యమవుతుంది. సహజంగా
ప్రతివారు మాయను గురించి తెలుసుకోవాలని కుతూహలపడతారు. అంతేకానీ మాయ ఎవరికా? అని కించిత్తైనా శోధించటానికి ఉన్మఖులు కారు. ఇది అవివేకం. మాయ నీకు అన్యంగా ఊహకందనిదిగా ఉంది.

నీవు ముందుగా నీవెవరివో తెలుసుకోవడానికి ప్రయత్నించు. ఊహకందని మాయను తెలుసుకోవడానికై కాలాన్ని, శక్తిని వ్యర్ధపరుస్తావెందుకు?

ఇంకోసారి ఒక ఫ్రెంచి దేశీయుడు మూడు రోజుల నుండి “మాయ అంటే ఏమిటి?” అని భగవానుని ప్రశ్నిస్తూనే ఉన్నాడు. భగవాన్ మాట్లాడటం లేదు. అతను విసిగిపోయి, “ఈ స్వామికి చెప్పటం ఇష్టం లేదు కాబోలు” నని తన ప్రయత్నాన్ని విరమించుకున్నాడు.

ఆరోజు ప్రసిద్ధ తత్వవేత్త శ్రీ రాధా కృష్ణన్ వచ్చారు. సర్వాధికారి నుండి ఆశ్రమంలో ఉన్న వారందరూ వారిని ఆహ్వానిస్తూ ఆశ్రమ విశేషాలు చెబుతూ, భగవాన్ దగ్గరకు తీసుకు వచ్చారు. వారు భగవాన్ సన్నిధిలో కొంతసేపు మౌనంగా కూర్చుని వెళ్ళటానికి లేచారు. అందరూ వారికి ఘనమైన వీడ్కోలుతో కారు ఎక్కించడానికి వెళ్లారు.
భగవాన్ సన్నిధిలో ఒక్కరూ లేరు. ఆ ఫ్రెంచ్ దేశీయుడు తప్ప.

భగవాన్ ఆయనతో “మీరు మూడు రోజుల నుండి మాయ అంటే ఏమిటో చెప్పమని అడుగుతున్నారు కదూ?” అన్నారు. “అవును స్వామీ, అడుగుతూనే ఉన్నాను. మీరు చెప్పలేదు కదా?” అన్నాడాయన. “ఇప్పుడు మన వారంతా ఎక్కడికి వెళ్లారు?”
“ఆయనకి వీడ్కోలు ఇవ్వడానికి”.
“ఆ – అదే మాయ అంటే ప్రత్యక్షంగా చూశారు గదా!” అన్నారు భగవాన్ నవ్వుతూ.

ఆ విదేశీయునికి ఏమీ అర్థం కాలేదు. ఊరికే గుడ్లు అప్పగించి చూస్తున్నాడు. భగవాన్ గ్రహించి, “బోధపడలేదా? ఇంకా వీరందరూ అన్నిటిని వదిలామనీ, మోక్షమే కావాలని అంటారు . తాము వచ్చిన పని మరిచిపోయి గొప్ప వాళ్ళ చుట్టూ చేరతారు. ఇవీ చేష్టలు. వచ్చిన పని మర్చిపోవటమే మాయ. ఇంతకంటే మాయ ఏముంది?” అన్నారు. ఆ విధేశీయుడు ఆనందంతో “తనను తాను తెలుసుకోవటమే జీవితాశయం. ఈ సంగతిని మరచిపోవడమే మాయ”, ‘అనేదే కదా తమ బోధ’ అన్నాడు.
“అదే, అదే”అన్నారు భగవాన్.

Author: go123

https://webtemplatesmonster.blogspot.in/