శుభాశుభాలను వదిలివేస్తాడో అట్టి భక్తుడే నాకు ప్రియుడు

*శ్లో॥* యోన హృష్యతి నద్వేష్టి నశోచతి న కాంక్షతి।
శుభా శుభ పరిత్యాగీ భక్తి మాన్యస్సమేప్రియః॥ (17)
*తా॥* ఎవడు సంతోషించడో, ద్వేషించడో, శోకించడో, కాంక్షించడో, శుభాశుభాలను వదిలివేస్తాడో అట్టి భక్తుడే నాకు ప్రియుడు.
*వ్యాఖ్య:-* _*నహృష్యతి – నద్వేష్టి – నశోచతి – నకాంక్షతి*_ :- *కోరికలు తీరితే, అనుకున్నది అనుకున్నట్లు జరిగితే సంతోషం. అదే హృష్యతి. అనుకున్నది అనుకున్నట్లు జరగకపోయినా, నష్టం కలిగినా కలిగేది శోకం. అదే శోచతి. మనకెవరైనా అపకారం చేస్తే అతడిపై ద్వేషం. అదే ద్వేష్ఠి. మనకులేని దాన్ని కోరుకుంటే కాంక్ష అదే కాంక్షతి*. ఈ హృష్యతి, శోచతి, ద్వేష్టి, కాంక్షతి – ఈ లక్షణాలన్నీ సామాన్యులకే గాని భక్తులకు ఉండవు. ఉంటే అతడు భక్తుడు కాడు.
మనం సామాన్యులుగా ఉన్నంతకాలం ఈ లక్షణాలు మనను వదలవు. ఎప్పుడైతే మనం భగవంతుని వైపుకు తిరిగి, భగవంతునితో సంబంధం పెట్టుకుంటామో ఆక్షణం నుండే ఈ అవలక్షణాల నుండి మనకు విముక్తి. అప్పుడు సంతోషంతో ఉప్పొంగిపోవటమో, బాధతో విలవిలలాడి పోవటమో, ద్వేషంతో తుకతుకలాడటమో, కోరికలతో వేగిపోవటమో ఉండదు. భగవంతునిలో కూర్చుంటే తృప్తి – సంతృప్తి.
ఒక అందమైన అమ్మాయి ఉంది; 18 సం॥ల వయస్సు. ఐతే కటిక పేదరికం. తల్లిదండ్రులు దుర్భర దారిద్యంతో ఉండటాన ఆమెకు సరైన తిండిలేదు. మంచి బట్టలు లేవు. ఐనా సహజ సౌందర్యంతో ఉన్నది. ఒకరోజున నీరు తేవటానికి చెరువు దగ్గరకు వెళుతున్నది. ఆ సమయంలో ఒక పారిశ్రామిక వేత్త కుమారుడు కారులో వెళుతూ చూచాడు. ఆ అమ్మాయినే వివాహం చేసుకోవాలనుకున్నాడు. తండ్రికి చెప్పి ఒప్పించాడు. తండ్రి అంగీకరించాడు. మూడు ముళ్ళు పడ్డాయి. ఇంతకువరకు 18 సం॥ల నుండి సంబంధం పెట్టుకున్న ఇంటితోను, తల్లిదండ్రులతోను, పేదరికంతోను సంబంధం తెగిపోయింది. ఇప్పుడా భర్తతోను, ఆ కుటుంబంతోను, సంపదలతోను సంబంధం పెట్టుకుంది. దానితో గొప్ప ఐశ్వర్యం. కోరుకున్నవన్నీ కాళ్ళ దగ్గరకు వస్తున్నాయి. నౌకర్లు చాకర్లు, ఒకటేమిటి? ఇప్పుడు తన పూర్వపు కుటుంబం వంటి కుటుంబాలను 100 కుటుంబాలను పోషించగలదు. ఆమెకు ఏలోటూ లేదు.
*అలాగే మనం ప్రపంచంతో సంబంధం పెట్టుకున్నంత కాలం సంతోషం, దుఃఖం, ద్వేషం, కాంక్ష – వీటితో సతమతమౌతూఉండాలి. ఒక్కసారిగా ఈ ప్రపంచంలో సంబంధం వదులుకొని పరమాత్మతో సంబంధం పెట్టుకున్నామా? – ఆ క్షణం నుండే మనం ఈ అన్ని అవలక్షణాల నుండి – అంటే కోరికలు (కాంక్ష), దుఃఖం (శోచతి), సంతోషం(హృష్యతి), ద్వేషం(ద్వేష్టి) అనే వాటినుండి విముక్తులమౌతాం*.

*To Subscribe* : https://chat.whatsapp.com/Hhr1b22uRHH2Gy3d1HhKPC

Author: go123

https://webtemplatesmonster.blogspot.in/