శ్రీకృష్ణుడు భగవద్గీతలో ఉన్నతమైన యోగస్థితిని ఎలా పొందగలమో వివరించాడు.

శ్రీకృష్ణుడు భగవద్గీతలో ఉన్నతమైన యోగస్థితిని ఎలా పొందగలమో వివరించాడు. అభ్యాసం, వైరాగ్యం అనే రెండు మాటలతో మనసును స్వాధీనం చేసుకోవడానికి సంబంధించిన మార్గం చూపించాడు. దీన్నే అభ్యాస యోగం, సాధన యోగం అంటారు.

మనసు స్వాధీనానికి తప్పనిసరిగా ‘యమ’ (అహింస, సత్యవ్రతం, దొంగతనం చేయకుండా ఉండటం, బ్రహ్మచర్యం, అపరిగ్రహం), ‘నియమ’ (శారీరక, మానసిక, పరిశుభ్రత, సంతృప్తి, శాస్త్రాధ్యయనం, దైవారాధన) అనే అభ్యాసాలు సాధన చేయాలని యోగశాస్త్రాలు చెబుతున్నాయి.

మనసు అల్లకల్లోలమైనప్పుడు మనం ఊపిరి వేగంగా తీసుకుంటాం. క్రమబద్ధతా ఉండదు. మనసును శాంతపరచడానికి శ్వాసను క్రమబద్ధం చేయడం ఒక పద్ధతి. నిండుగా గాలిని పీల్చి వదలడాన్ని క్రమం తప్పకుండా అభ్యసిస్తే నిశ్చలమైన మానసిక స్థితిని పొందవచ్చు. ప్రాణశక్తి మీద పట్టు సాధించడం కోసం ఊపిరిని నియంత్రించడమే ప్రాణాయామం.

యోగి ఎవరన్నదానికి గీతలో కృష్ణుడు సమాధానమిచ్చాడు. ఈ ప్రాపంచిక కోరికలు, వాంఛల నుంచి మనసును అధిగమించి స్వతంత్రంగా, వ్యక్తిగా ఉండగలిగేవారే యోగి.

మనసును అధిగమించడమంటే దాన్ని నొక్కిపెట్టి ఉంచడం, నియంత్రించడం కాదు. మనసనేది ఆలోచనల ప్రవాహం. కోరికలు, వాంఛలూ ఆలోచనలతో సంక్రమించేవే. అంతవరకూ అనుభవంలోకి రాని దాన్ని అనుభవించాలనుకోవడం కోరిక. అదే అనుభవాన్ని మళ్ళీ మళ్ళీ పొందాలనుకోవడం వాంఛ.

ఆలోచనతో గుర్తింపు అంటే- ‘నేను కోపంగా ఉన్నాను’ అనుకోవడం కాకుండా ‘నా మనసు తెరమీద కోపం కనిపిస్తోంది’ అనుకోవాలి. ఆ కోపాన్ని చూడగలిగినప్పుడు ఆలోచనను వేరుచేయడం కుదురుతుంది. ఆ ఉద్వేగాన్ని తన నుంచి దూరంగా ఉంచినప్పుడు అది బలహీనపడుతుంది. ఆలోచనలను ఒక సాక్షిగా చూడగలిగినప్పుడు వ్యక్తికి, అతడి ఆలోచనకు ఖాళీ ఏర్పడుతుంది. యోగి కావడానికి కోరిక అడ్డుకాదు. ఆ కోరిక కోసం పాకులాడటం, దానికి అతుక్కుపోవడం చేయకూడదు. అందుకే మనసును అధిగమించాలి.

ఒకే గమ్యం చేరుకోవడానికి నాలుగు యోగమార్గాలను సూచించారు. నిత్య జీవితంలో ఇంటాబయటా ఎటువంటి అహం లేకుండా పనిచేసుకుపోతూ, కొంత దైవ చింతనతో ఇతరులకు సహాయాన్ని అందించడం కర్మయోగ.

సాధకుడు ప్రార్థన, దైవారాధన, నిర్నినిబంధంగా ఇతరులను ప్రేమించడం భక్తియోగలో భాగం.

మానసిక విజ్ఞానం తెలుసుకుని చేసే ఒక ప్రయాణం లాంటిది రాజయోగ. జీవశక్తి (ప్రాణం) గురించి అవగాహన, ధ్యానంతో మనసును ప్రభావితం చేయాలి అనుకునేవారికి రాజయోగ చక్కని మార్గం.

బుద్ధిజీవులకు తోడ్పడేది జ్ఞానయోగ. వేదాంతాన్ని ఒక వాహనంగా తీసుకుని మనశ్శక్తితో ముందుకెళ్ళడం. వ్యక్తిగత స్వభావాల గురించి తెలిసుండాలి. ఇతర మార్గాల్లోని పాఠాలను గ్రహించినవారు ఈ మార్గంలో ఆత్మజ్ఞానం పొంది ఆధ్యాత్మిక బాటలో పయనిస్తారు.

‘యోగ అన్నది విజ్ఞానశాస్త్రం. సాధకులకు మనసును అధిగమించడమెలాగో నేర్పుతుంది’ అని పతంజలి యోగ సూత్రాలు చెబుతున్నాయి. స్థితప్రజ్ఞత గురించి ప్రస్తావిస్తూ, ఏ చర్య చేపట్టాలన్నా యోగికి ఉండే కౌశలాన్ని సంపాదించాలంటాడు భగవద్గీతలో శ్రీకృష్ణుడు.

యోగ సాధన వల్ల మనసులో సద్భావనలు చోటుచేసుకుంటాయి. చిత్తశుద్ధి ఏర్పడుతుంది.

‘వెయ్యిమందిని వెయ్యిసార్లు యుద్ధంలో ఓడించినవాడికన్నా తన మనసును జయించినవాడే పరాక్రమవంతుడు’ అంటాడు గౌతమ బుద్ధుడు.

🕉🌞🌎🌙🌟🚩

Author: go123

https://webtemplatesmonster.blogspot.in/