నిజమైన ధనవంతుడు

ఒకసారి రవీంద్రనాథ్ టాగూర్ జపాన్ కు వెళ్ళాడు. ఆయన రాసిన గీతాంజలి పుస్తకం పై ఓ పది రోజుల పాటు రోజూ సాయంత్రం ఆరు నుంచి ఏడు వరకు ప్రసంగించేవాడు. ఆ ప్రసంగం వినడానికి ఓ వృద్ధుడు క్రమం తప్పకుండా వచ్చేవాడు. ప్రసంగం ప్రారంభం కావడానికి చాలా సమయం ముందే అక్కడికి వచ్చేవాడు. రవీంద్రునితో పాటు లేచి వెళ్ళేవాడు. ప్రసంగం అయిన తర్వాత రవీంద్రుని గౌరవంతో రోజా పూలమాలతో సత్కరించేవాడు. ఆయన ప్రవర్తన చాలా సాదాసీదా గా ఉండేది. రవీంద్రుడు చెప్పే ప్రతి మాట శ్రద్ధగా విని జీవితానికి అన్వయించుకోవడానికి ప్రయత్నించేవాడు. ఆయన వేసుకున్న దుస్తులు కూడా చాలా సాధారణంగా ఉండేవి. ఒక్కమాటలో చెప్పాలంటే ఆయనకి రవీంద్రుడంటే వల్లమాలిన అభిమానం.

రవీంద్రుడు తన ఉపన్యాసం చాలించిన తర్వాత చాలామంది గౌరవభావంతో ఆయన పాదాలను భక్తితో స్పృశించేవారు. ఆత్మజ్ఞానం మీద ఆయన చేసే ఉపన్యాసాలు వారి జ్ఞాన పరిధిని ఎంత విస్తృతం చేస్తున్నాయో తెలియకుండానే చాలా మంది వినేవారు. ఆయన చెప్పే ప్రతి ఒక్క మాట వారి జీవితానికి అంత విలువైనది. ఈ జ్ఞానం కోసమే శ్రీకృష్ణ పరమాత్మ సాందీపనీ మహర్షి దగ్గరికీ, శ్రీరామచంద్రుడు తమ కుల గురువైన వశిష్ఠముని దగ్గరికీ వెళ్ళారు.

ఆ ముసలాయన ప్రతి రోజూ రవీంద్రుల ముందు మోకరిల్లేవాడు. ఆయన చివరి ఉపన్యాసం అయిపోయిన తరువాత చాలామంది బంగారు నాణేలు, ధనం, పండ్లు, పూలు ఆయనకు సమర్పించారు. ఆ ముసలాయన మాత్రం చాలా మర్యాద పూర్వకంగా తన ఇంటిని సందర్శించమన్నాడు.

రవీంద్రుల వారు ఇదివరకే ఆయన భక్తికి సంతుష్టులై ఉన్నాడు కాబట్టి ఆ ఆహ్వానాన్ని మన్నించాడు. ఆ ముసలాయన మనస్సు ఆనందంతో పులకించిపోయింది.

టాగూర్ తన సహాయకుడిని పిలిచి ఈ విధంగా అన్నాడు. “ఈ పెద్దాయన చూస్తే ఉద్విగ్న మనస్కుడిలాగా ఉన్నాడు. మన రాక కోసం ఆయన ఎక్కువ ఖర్చు పెట్టకుండా చూసే బాధ్యత నీది. అలాగే వారి పిల్లలకు కూడా 200 యెన్ లు ఇవ్వండి.”

ఆ ముసలాయన సాయంత్రం ఖచ్చితంగా మూడు ముప్పావు అయ్యేసరికి రోల్స్ రాయిస్ కారులో టాగూర్ ఉండే అతిథి గృహం ముందు వాలిపోయాడు. అంతకు మునుపు టాగూర్ నాలుగు గంటలకు వస్తాడని చెప్పి ఉన్నాడు. ఆయన రవీంద్రుని ఆ కార్లో ఎక్కించుకుని ఓ కొండ లాంటి ప్రదేశం పై ఉన్న ఇంద్రభవనం లాంటి పెద్ద భవంతిలోకి తీసుకెళ్ళాడు. వెళ్ళగానే వాచ్‌మాన్ గౌరవంగా తలుపు తీసి నిలబడి సెల్యూట్ చేశాడు. లోపలికి వెళ్ళగానే గౌరవంగా కనిపిస్తున్న చాలామంది పెద్ద మనుషులు ఆయన్ను ఆత్మీయంగా ఆహ్వానించారు. బంగారు సింహాసనం మీద కూర్చోబెట్టారు. బంగారు పాత్రల్లో సుమారు రెండు వందల రకాల వంటలు రుచి చూపించారు. ఆయన కుటుంబమంతా టాగూర్ కు పూజ చేసినట్లు చేసి ఆయన పాదాల దగ్గర ఆసీనులయ్యారు.

రవీంద్రుల వారికి ఇదంతా ఆశ్చర్యంగా ఉంది. ఆ వృద్ధుడితో “మీరు నన్ను ఎక్కడికి తీసుకు వచ్చారు? దయచేసి మీ ఇంటికి తీసుకు వెళ్ళండి. ఈ భవనానికి ఎందుకు తీసుకువచ్చారు?” అన్నాడు.

అప్పుడాయన “ఓ ఋషి వర్యా! ఇదే నా ఇల్లు. ఈ కార్లు, ఈ బంగళా అన్నీ నావే. నీ ముందు మోకరిల్లిన వారు అంతా నా భార్యా, పిల్లలు, కోడళ్ళు, అల్లుళ్ళు, మనుమలు, మనుమరాండ్రు. నాకు రెండు కర్మాగారాలున్నాయి.”

“ఓ అయితే మీరు ఇంత ధనవంతులై ఉండి కూడా నా దగ్గరకు వచ్చేటపుడు అతి సాధారణంగా వచ్చేవారు. ఎందుకో తెలుసుకోవచ్చా?” అనడిగాడు రవీంద్రుడు.

“స్వామీ! భౌతిక సంపదలు నిజమైన వ్యక్తిత్వానికి కొలమానాలు కావు. నాకింత ధనముందని గర్వంగా చెప్పుకోవడం కేవలం మూర్ఖత్వం. ఆ ధనం ఎంత పోసినా ఆత్మానందాన్ని కొనలేము. మనకున్న సంపద ఎప్పుడు ఎలా కరిగిపోతుందే ఎవరికీ తెలియదు. అలాగే ఎల్లప్పుడూ తన సంపాదనలు కాపాడుకోవడానికి ఆలోచిస్తుండేవాడు తన గురించి తాను ఆలోచించడానికి సమయం ఉండదు. ఈ ప్రపంచం దాటితే ఆ సంపదలకు విలువ ఉండదు.”

“అమూల్యమైన ఆత్మాజ్ఞానంతో పోలిస్తే ఈ సంపదలంతా చాలా చిన్నవి. ఈ సంపదలు నాకు కష్టాలు కొనితెచ్చిపెడుతుంటే మీరిచ్చిన జ్ఞానం నాకు అత్యంత సంతోషాన్నిస్తున్నది. నా జీవితమంతా మీకు కృతజ్ఞుడిగా ఉంటాను. ఇప్పటి దాకా సిరిసంపదలే ధ్యేయంగా బతికాను. అవేవీ నాకు సంతోషాన్నివ్వలేదు. మీరు చెప్పిన ప్రతి మాటా నా అజ్ఞాన పొరలను తొలగించాయి.నేను మామూలు దుస్తులు వేసుకుని మీ దగ్గరకు రావడానికి కారణం, జ్ఞాన సముపార్జనలో మీ దగ్గర నేను ఓ యాచకుణ్ణి మాత్రమే అని సూచించడానికే. మీ సమక్షంలో నేను ఎంతో సంతోషంగా ఉన్నాను.”

ఈ మాటలు వినగానే రవీంద్రుల వారి హృదయం ఆనందంతో ఉప్పొంగిపోయింది. కాబట్టి ఎక్కడైతే నిజమైన విద్యకు విలువ ఉంటుందో అక్కడే జీవితానికి గౌరవం ఉంటుంది, సత్పురుషుల బోధనలు ఎక్కడ గౌరవించబడతాయో అక్కడ సిరిసంపదలకు విలువ లేదు.

రవీంద్రుల వారు సంతోషంగా “ఓ మిత్రమా! నీకు సిరిసంపదల కన్నా ఆత్మసాక్షాత్కారం మీదనే మక్కువ ఎక్కువ. నీవు నిజంగా ధనవంతుడవే. నీ లాంటి శిష్యుని కలుసుకున్నందుకు నాకు ఈ రోజు చాలా సంతృప్తిగా ఉంది. నా బోధనలకు సార్థకత చేకూరింది.”

“నేను ఎక్కడికి వెళ్ళినా జనాలు భౌతిక మైన సుఖ సంపదల కోసం అడుగుతూ అమూల్యమైన సమయాన్ని వృధా చేసేవారు. కానీ మీరు తెలివైన వారు. మీరు అడగకపోయినా భగవంతుడు మీకు అన్నీ ఇస్తున్నాడు. మీ జ్ఞాన తృష్ణను తీర్చడానికే నన్ను ఆ భగవంతుడు ఇక్కడికి పంపినట్లున్నాడు.” అని ఆయన దగ్గర సెలవు తీసుకున్నారు

 

మనల్ని సృష్టించిన దేవుడు ఎంత శక్తి ఇచ్ఛాడో మీకు తెలుసా ?

దేవుడు మనిషిని సృష్టించడం సైన్సు పరంగా తెలుసుకుందాం
మానవుని యొక్క మెదడులో 10 కోట్ల కణములు ఉన్నవి. మానవుని కంటిలో 13 కోట్ల చిన్న చిన్న రాడ్ కణములు, 70 లక్షల కోన్ కణములు, 3 లక్షల నరములతో కలుపబడి ఉన్నవి. ఒక కన్ను తయారు చేయుటకు 2 లక్షల టెలివిజను ట్రాన్స్ మీటర్లు, 2 లక్షల టెలివిజను రిసీవర్లు కావలెను
* హార్మోనియం లో 45 కీలు, పియానోలో 88 కీలు, మానవుని చెవిలో 15,000 కీలు ఉన్నాయి
* మానవుని శరీరములో 1,00,000 మైళ్ళ పొడవైన రక్తనాళములు కలవు. ప్రతి క్షణమునకు 20 లక్షల కణములు తయారగుచున్నవి
*మానవుని హృదయము నిముషమునకు 72 సార్లు, రోజుకు ఇంచు మించు 1,00,000 సార్లు, సంవత్సరమునకు 4 కోట్ల సార్లు ఎటువంటి విశ్రాంతి లేకుండా కొట్టుకొనుచున్నది
* మానవుని జీవిత కాలములో హృదయము లోని ఒక చిన్న కండరము 30 కోట్ల సార్లు సంకోచ వ్యాకోచములు చేయును
*మానవుని శరీరములోని రసాయన పదార్ధములన్నీ కొనాలి అంటే 2 కోట్ల 70 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. మనిషి చనిపోయాక అమ్మితే 6 రూపాయల 45 పైసలు వచ్చును
*మనిషి నవ్వటానికి శరీరములో 17 కండరములు కోపపడటానికి 43 కండరములు పనిచేస్తాయి
* మనిషి చర్మములొ 46 మైళ్ళ పొడవైన నాడులు ఉన్నాయి
* మనిషి శరీరములోని రక్తనాళములు అన్నీ ఒకదానికి ఒకటి జోడిస్తే 1,00,000 మైళ్ళ పొడవు ఉండును
మానవుని నాలుక పైన రుచిని తెలుపటానికి 3000 రకాల బుడిపెలు ఉంటాయి ఆరోగ్యము కల మనిషి ఒకరోజులో 23000 సార్లు శ్వాస పీల్చును
* మనిషి చేతివేళ్ళ చర్మము మీద ప్రతి చదరపు అంగుళానికి 3000 స్వేద గ్రంధులు ఉన్నాయి
*మనిషి తలపై సగటున 1,00,000 వెంట్రుకలు ఉంటాయి
*మానవుని పంటి దవడ 276 కేజీ ల కంటే ఎక్కువ బరువు ఆపగలదు
*మానవుని శరీరములో 206 ఎముకలు కలవు
* మనిషి జీవిత కాలములో 16,000 గాలన్ల నీరు తాగుతాడు, 35000 kgs food తింటారు.
*మనిషి నోటిలో రోజుకు 2 నుండి 3 పాయింట్ల జీర్ణరసము ఏర్పడుతుంది
*మనిషి జీవిత కాలములో గుండె 100 ఈతకోలనులు నింపగలిగిన రక్తము పంపు చేస్తుంది
*మానవుని శరీరములో నాలుకయే బలమైన కండరము
*మానవుని శరీరములో 100 ట్రిలియను కణములు ఉంటాయి
*మానవుని మెదడులో 80% నీరు ఉంటుంది
*మానవుని మెదడుకు నొప్పి తెలియదు
*మానవుని శరీర బరువులో ఎముకుల వంతు 14% ఉంటుంది
*మానవుని వ్రేళ్ల కొనలకు శరీర బరువును మొత్తము ఆపగల శక్తి ఉంటుంది
* మానవుని ఎముకలు బయటికి గట్టిగాను లోపల మెత్తగాను ఉంటాయి. వీటిలో 75% నీరు ఉంటుంది
*తుమ్ము గంటకు 100 మైళ్ళ వేగముతో ప్రయాణిస్తుంది
*చేతి వ్రేళ్ల గోళ్ళు కాలి వ్రేళ్ల గొల్ల కన్నా 4 రెట్లు తొందరగా పెరుగును
*స్త్రీ గుండె పురుషుని గుండె కన్నా ఎక్కువ వేగముగా కొట్టుకుంటుంది.
*స్త్రీలు పురుషుల కన్నా ఎక్కువ సార్లు కనురెప్పలు అర్పుతారు
* రక్తము నీరు కన్నా కుడా 6 రెట్లు చిక్కగా ఉంటుంది
*మానవుని మూత్రపిండములు నిముషమునకు 1.3 లీటర్ల రక్తమును శుద్ది చేయును. రోజుకు 1.4 లీటర్ల ముత్రమును విసర్జించును
*స్త్రీ శరీరములో 4.5 లీటర్ల రక్తము, పురుషుని శరీరములో 5.6 లీటర్ల రక్తము ఉంటాయి
*మానవుని గుండె రక్తమును 9 మీటర్ల ఎత్తు వరకు చిమ్మకలిగిన శక్తి కలిగి ఉంటుంది
*మానవుని శరీరములో రక్త ప్రసరణ జరగని ఒకే ఒక్క ప్రాంతము కంటిలోని కరోన
*ఒక ఎర్ర రక్త కణమునకు శరీరము మొత్తము చుట్టి రావటానికి 20 సెకన్ల సమయము పడుతుంది
* రక్తములోని ప్రతి చుక్క కుడా శరీరము చేత రోజుకి 300 సార్లు శుద్ది చేయబడుతుంది
*మానవుని జుత్తు, చేతి గోళ్ళు చనిపోయిన తరువాత కుడా పెరుగుతాయి
*మనిషి గొంతులో ఉండే హ్యోఇడ్ అనే ఎముక శరీరములోని వేరే ఏ ఎముకతోను అతుకబడి ఉండదు
*మనిషి పుర్రె 10 సంవత్సరములకు ఒకసారి మారుతూ ఉంటుంది
*మనిషి మెదడులోని కుడి బాగము శరీరములోని ఎడమ బాగమును, మెదడులోని ఎడమ బాగము శరీరములోని కుడి బాగమును అదుపు చేయును
*మనిషి ఏమి తినకుండా 20 రోజులు, ఏమి త్రాగకుండా 2 రోజులు బ్రతుకును
*మనిషి ముఖములో 14 ఎముకలు ఉండును
*మానవుని నాడి నిముషమునకు 70 సార్లు కొట్టుకొనునుv ప్రతి 7 రోజులకు ఒకసారి శరీరములోని ఎర్ర రక్త కణములలో సగము మార్పిడి చేయబడును
*మనిషి దగ్గినపుడు గాలి శబ్ద వేగముతో ప్రయాణము చేయును
*ఆహారము నోటిలో నుండి పొట్ట లోపలి చేరటానికి 7 సెకన్ల సమయము పడుతుంది
*మనిషి శరీరములో 75% నీరు ఉంటుంది
*మనిషి కంటితో 2.4 మిలియను కాంతి సంవత్సరముల దూరము (140,000,000,000,000,000,000 మైళ్ళు) చూడవచ్చు. Approx 528 megapixel lense.
*ఇంత గొప్పగా మనలను తయారుచేసిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతలు కలిగి ఉండి విజయం సాధిస్తాం.
ఇప్పుడు చెప్పండి మీలో ఏమి తక్కువగా ఉంది? .
ఇక నిరాశ , నిస్పృహ వద్దు.
గమ్యం చేరే వరకు ప్రయాణిoచండి.

 

Who are You… You are Soul(Power)

జ్ఞానంతో తెలుసుకోదగినది. అదే *పరమాత్మ*. పరమాత్మను జ్ఞానం ద్వారా *మాత్రమే* తెలుసుకోగలం, పొందగలంగాని కర్మల ద్వారా సాధ్యం కాదు. అందుకే ‘ *జ్ఞానే నైవతు కైవల్యం* ’ అన్నారు. *కర్మలవల్ల ఎందుకు పొందలేం పరమాత్మను?*
*(i)* కర్మలవల్ల ఉత్పత్తి జరుగుతుంది. ఆత్మ ఉత్పత్తి అయ్యేది కాదు. తయారయ్యేది కాదు. అది ఎప్పుడూ ఉండేది.
*(ii)* కర్మలవల్ల లేని వస్తువును పొందటం జరుగుతుంది. ఆత్మ లేని వస్తువు కాదు. పొందే వస్తువు కాదు. అది నిత్యం. శాశ్వతం.
*(iii)* కర్మలవల్ల సంస్కారం జరుగుతుంది – శుద్ధి జరుగుతుంది. ఆత్మ నిత్య శుద్ధం. ఏ కల్మషాలు లేనిది. కనుక శుద్ధి జరగటం అంటూ లేదు.
*(iv)* కర్మలవల్ల అనేక వికారాలు (మార్పులు) జరుగుతాయి. ఆత్మ ఏ వికారాలు లేనిది. నిర్వికారం. కనుక ఆత్మ కర్మల ద్వారా పొందబడేది కాదు. కేవల జ్ఞానం ద్వారా మాత్రమే ఆత్మానుభూతి సాధ్యం.

గీతాజ్ఞానబోధ పూర్తయిన తర్వాత భగవానుడు అర్జునుని అడిగాడు, “అర్జునా! నీ *మోహం* నశించిందా?” అని. దానికి అర్జునుడన్నాడు “ *నష్టో మోహః స్మృతిర్లబ్ధః త్వత్ ప్రసాదాన్మయాచ్యుత!* ” నీ దయవల్ల అచ్యుతా! నా మోహం నశించింది, స్మృతి కలిగింది – అని.

చీకటిలో ప్రయాణమై పోతున్నావు. నిర్జనప్రదేశం. ఒంటరితనం. భయం. దూరంగా దయ్యం కనిపించింది. భయంవేసింది. అంతలో మెరుపుమెరిసింది. ఒక్కసారి కాంతి వచ్చింది. ఆ వెలుగులో చూచావు. నీ ఎదుటనున్నది, ఇంతవరకు నీవు చూచి భయపడినది దయ్యం కాదు. అది ఒక చెట్టు మొద్దు. దయ్యాన్ని నీవు చెట్టు మొద్దుగా మార్చలేదు. అసలక్కడ ఉన్నది చెట్టే. అయితే చీకటిలో దానిని చూచి దయ్యం అనుకున్నావు. మెరుపు *వెలుగులో నీ భ్రమ తొలిగింది. చెట్టును చెట్టుగా గుర్తించావు. అంతే*.
*అలాగే అజ్ఞానంలో ఈ దేహమే నేను అనుకుంటున్నావు. అది భ్రమ, మోహం. శ్రీకృష్ణుని జ్ఞాన బోధతో అజ్ఞానమనే చీకటి తొలగింది. జ్ఞానమనే వెలుగు ప్రసరించింది. అంతే. ఇప్పటిదాకా దేహమే నేను అనే భ్రమ తొలగింది. ఆత్మను అనే అనుభూతి కలిగింది. స్మృతి కలిగింది. అజ్ఞానం వల్ల స్మృతి తప్పింది – భ్రమ కలిగింది. జ్ఞానంతో భ్రమ తొలగింది. స్మృతి కలిగింది*.

 

ఆలోచనలు అసలు ఆగటం లేదు, వాటినెలా నియంత్రించాలి

అనవసరమైన వెంపర్లాటే మనసు అదుపుకాని అదనపు ఆలోచనలకు కారణం. మన కష్టాన్ని, అవసరాన్ని దైవం గమనిస్తూ ఎవరో ఒకరి రూపంలో తీరుస్తోంది. ఈ విషయాన్ని మనం గుర్తించటంలేదు. నిరంతరం ఏదొక పవిత్ర నామస్మరణతో ఆలోచనలను నియంత్రించవచ్చు. గుండె కదలిక ప్రాణాన్ని తెలిపినట్లే, మంత్రజపం మనలో చైతన్యాన్ని తెలుపుతుంది. బయటి విషయాలకోసం మన తెలివిని ఉపయోగించటం వల్ల అది ఆలోచనగా మారుతుంది. ఓపిక, సహనం లేకపోవటం వలన తెలివిని అధికంగా ఉపయోగించి మనసును మనం కలుషితం చేసుకుంటున్నాం. బయటి వస్తువుల కోసం ఆలోచన అవసరం. లోపలి వస్తువును వెదికేప్పుడు ఆలోచన అవసరంలేదు. అది అడ్డు కూడా. ఈ ఆలోచనలను వదిలించుకోవటానికే పెద్దలు పవిత్ర మంత్రజపాన్ని నిర్ధేశించారు. మంత్రం చేసేప్పుడు కూడా ఆలోచిస్తూనే ఉంటే సాధన వృధా అవుతుంది. అనవసర ఆలోచనల మధ్య దైవంపై శ్రద్ధ నిలబడదు.

ఆధార గ్రంథం : “శ్రీరమణీయం”
హృదయ స్పందనే తొలి దైవానుగ్రహం

 

దైవం ఉండే స్థానం తెలుసుకోవటం, దైవానుభవం ఒక్కటేనా

కాదు. దైవం ఉండే స్థానం హృదయమని తెలిసినా, మనం అక్కడ శోధించకుండా ఎక్కడెక్కడో వెదుకుతున్నాం. అంటే ఇంకా దేనికోసమో వెంపర్లాడుతున్నామని అర్ధం. దైవం ఉండే స్థానం తెలియగానే సరిపోదు. మనలోనే ఉన్న దైవాన్ని అనుభవించాలి. నిరంతరం ఆ దైవభావనలో ఉండాలి. దైవభావన అంటే మనం దైవంతో సమానమని కాదు. మనం దైవంలో ఒక భాగమనే భావన ఉండాలి. దైవం కోసం వెదికేవారికి ఆ దైవం తమ హృదయంలోనే ఉన్నదన్న సత్యం తెలిస్తే స్వాంతన వస్తుంది. వెతుకులాట తగ్గుతుంది. శివోహం అనే భావన మనల్ని శివుడిలో భాగంగా చేస్తుంది. గరుడ అహంభావన వల్ల నీవు గ్రద్దవి కాలేకపోవచ్చు గానీ పాము విషం నుండి రక్షణ ఉంటుందని భగవాన్ శ్రీరమణమహర్షి అన్నారు. అలాగే శివోహం అనే భావన నేరుగా మనని శివుడిగా మార్చదు. అహంభావన రహిత శివస్థితిని కల్పిస్తుంది.

{ఆధార గ్రంథం : “శ్రీరమణీయం”}

 

బంధం – మోక్షం రెండూ మనసులోనే ఉన్నాయి

మనసు సత్వగుణంలో ఉన్నపుడు దేనినీ ఆశించదు. ప్రాపంచిక విషయాలను ఏమాత్రం కాంక్షించదు. మనసు దేనినీ ఆకాంక్షించని, తిరస్కరించని కొన్ని నిర్లిప్త నిమిషాలు జీవనంలో మనకు తరచూ తారసపడుతుంటాయి. అప్పుడు మనసును గమనిస్తే ఏ కోరికలేని స్థితి వల్ల అలా సాధ్యమైందనేది అర్థమౌతుంది. నిజానికి అదే మోక్ష స్థితి. కానీ మనసులో వాసనలు పూర్తిగా క్షీణించని కారణంగా ఆస్థితి స్థిరంగా, శాశ్వతంగా నిలబడదు. తిరిగి తమొగుణం, రజోగుణం ఆవరించగానే వాసనలు విజృంభించి ఏదో ఒక ప్రాపంచిక విషయంపైకి మనసు పరుగులు తీసి బంధంగా మారుతుంది. మనసుకు ఏది బంధమో, ఏది మోక్షమో తెలుసుకోడానికి మనసును గమనించే విచారణ మార్గం దోహదపడుతుంది. విచారణ సాగే కొద్ది బంధం, మోక్షం రెండూ మనసులోనే ఉన్నాయని అర్ధం అవుతుంది.”*_

 

మాయ అంటే ఏమిటి?

మాయా ఎవరికో ముందుగా విచారించండి. అప్పుడే మాయ అదృశ్యమవుతుంది. సహజంగా
ప్రతివారు మాయను గురించి తెలుసుకోవాలని కుతూహలపడతారు. అంతేకానీ మాయ ఎవరికా? అని కించిత్తైనా శోధించటానికి ఉన్మఖులు కారు. ఇది అవివేకం. మాయ నీకు అన్యంగా ఊహకందనిదిగా ఉంది.

నీవు ముందుగా నీవెవరివో తెలుసుకోవడానికి ప్రయత్నించు. ఊహకందని మాయను తెలుసుకోవడానికై కాలాన్ని, శక్తిని వ్యర్ధపరుస్తావెందుకు?

ఇంకోసారి ఒక ఫ్రెంచి దేశీయుడు మూడు రోజుల నుండి “మాయ అంటే ఏమిటి?” అని భగవానుని ప్రశ్నిస్తూనే ఉన్నాడు. భగవాన్ మాట్లాడటం లేదు. అతను విసిగిపోయి, “ఈ స్వామికి చెప్పటం ఇష్టం లేదు కాబోలు” నని తన ప్రయత్నాన్ని విరమించుకున్నాడు.

ఆరోజు ప్రసిద్ధ తత్వవేత్త శ్రీ రాధా కృష్ణన్ వచ్చారు. సర్వాధికారి నుండి ఆశ్రమంలో ఉన్న వారందరూ వారిని ఆహ్వానిస్తూ ఆశ్రమ విశేషాలు చెబుతూ, భగవాన్ దగ్గరకు తీసుకు వచ్చారు. వారు భగవాన్ సన్నిధిలో కొంతసేపు మౌనంగా కూర్చుని వెళ్ళటానికి లేచారు. అందరూ వారికి ఘనమైన వీడ్కోలుతో కారు ఎక్కించడానికి వెళ్లారు.
భగవాన్ సన్నిధిలో ఒక్కరూ లేరు. ఆ ఫ్రెంచ్ దేశీయుడు తప్ప.

భగవాన్ ఆయనతో “మీరు మూడు రోజుల నుండి మాయ అంటే ఏమిటో చెప్పమని అడుగుతున్నారు కదూ?” అన్నారు. “అవును స్వామీ, అడుగుతూనే ఉన్నాను. మీరు చెప్పలేదు కదా?” అన్నాడాయన. “ఇప్పుడు మన వారంతా ఎక్కడికి వెళ్లారు?”
“ఆయనకి వీడ్కోలు ఇవ్వడానికి”.
“ఆ – అదే మాయ అంటే ప్రత్యక్షంగా చూశారు గదా!” అన్నారు భగవాన్ నవ్వుతూ.

ఆ విదేశీయునికి ఏమీ అర్థం కాలేదు. ఊరికే గుడ్లు అప్పగించి చూస్తున్నాడు. భగవాన్ గ్రహించి, “బోధపడలేదా? ఇంకా వీరందరూ అన్నిటిని వదిలామనీ, మోక్షమే కావాలని అంటారు . తాము వచ్చిన పని మరిచిపోయి గొప్ప వాళ్ళ చుట్టూ చేరతారు. ఇవీ చేష్టలు. వచ్చిన పని మర్చిపోవటమే మాయ. ఇంతకంటే మాయ ఏముంది?” అన్నారు. ఆ విధేశీయుడు ఆనందంతో “తనను తాను తెలుసుకోవటమే జీవితాశయం. ఈ సంగతిని మరచిపోవడమే మాయ”, ‘అనేదే కదా తమ బోధ’ అన్నాడు.
“అదే, అదే”అన్నారు భగవాన్.

 

ఆత్మసాక్షాత్కారము సాధన – సాధకులు

*సాధన*
అంతరదృష్టితో అంతర్ముఖమై ఆంతర్యంలోనికి పయనిస్తేనే ఆత్మజ్ఞానం అలవడుతుంది. ఆత్మజ్ఞానం అలవడితేనే ఆత్మసాక్షత్కారం అవుతుంది. ఆత్మసాక్షత్కారం పొందుటకు చేసే ప్రయత్నమే “సాధన”.
ఆధ్యాత్మిక జీవితాన్ని గడపాలని, అనంతుడుని తెలుసుకోవాలన్న జిజ్ఞాస ప్రారంభమయ్యాక ఎన్నో సంఘర్షణలు, సందేహాలు. ఎలా పయనించాలి, ఏం చేయాలి, ఎలా సాధించగలను, ఎవర్ని ఆశ్రయించాలి…ఓహో… ఎన్నో ప్రశ్నలు.
అయితే తమ తమ సంసారధర్మాలను, గృహధర్మాలను, లౌకిక భాధ్యతలన్నింటిని నిర్వర్తిస్తూ, పరమగమ్యంను చేరగోరు గృహస్థభక్తులుకు తమ దైనందికకార్యంలలో ఆధ్యాత్మిక సాధన ఓ అంతర్భాగమై ఉండాలి.
సాధనకు కావాల్సింది మొదటిగా మనో నియంత్రణ. వ్యవహారికంలో పూర్తి భావజాగృతిలో ఉంటూ, ప్రతీక్షణం ప్రతీ చిన్నపనిలో కూడా నాచే ఇది భగవంతుడే చేయిస్తున్నాడన్న భావనతో ఎరుకలో ఉండగలిగినప్పుడే మనోరహితస్థితి కల్గుతుంది.
అటుపై కావాల్సింది అంతఃకరణశుద్ధి. ఇది అలవడాలంటే అందుకు కావాల్సింది వివేకం (బ్రహ్మ సత్యం, జగత్తు మిధ్య అను సత్య దృఢ నిశ్చయజ్ఞానమే వివేకం. అనిత్యమైన ప్రపంచవిషయాలను విడిచిపెట్టి నిత్యమైన ఆత్మగురించి ఆలోచించడమే వివేకం), వైరాగ్యం (ఇహపర భోగాలపట్ల అభిలాష లేకపోవడం), శమం (మనోనిగ్రహం), దమం (చక్షురాది బాహ్యేంద్రియ నిగ్రహం), ఉపరతి (స్వధర్మానుష్టానం), తితిక్ష (శీతోష్ణ సుఖదుఃఖంలను సహించుట), శ్రద్ధ (దేనిచేత సద్వస్తువు తెలియబడునో అట్టి శాస్త్రంనందును, గురువాక్యంలందును సంపూర్ణ విశ్వాసం), సమాధానం (చిత్తంను ఏకాగ్రతలో ఉంచుట), ముముక్షత్వం (మోక్షం కావాలనే తీవ్ర కోరిక) భక్తి (స్వ స్వరూప అనుసంధానం అంటే నిదిధ్యాస), ధ్యానం (సత్యమైన ఏకవస్తువును చింతించడం), సేవ (పరోపకారజీవనం), సమత్వం (శత్రుమిత్రులయందు, మానావమానములయందు, సుఖదుఃఖంలయందు, సర్వ పరిస్థితులయందు సమభావంతో ఉండుట), శౌచం (జ్ఞానవైరాగ్యంలనెడి మృత్తిక చేత మదిని క్షాళ నం కావించి, వాసనాత్రయంను నశింపచేసుకోవడం), దయ (దుఃఖితులయందు కృప), సజ్జనసాంగత్యం (భగవత్తత్త్వాన్ని గ్రహించే వారితో సాంగత్యం), ఋజువర్తనం (చక్కటి నడవడిక) ఏకాత్మభావన (అందరూ ఆత్మస్వరూపులే అన్న భావం) అభ్యాసం చేయాలి. ఈ అభ్యాస సమయంలో ఎదురయ్యే కష్టాలు, నష్టాలు, ఆనందాలు, ఆవేదనలు, సమస్యలు, సంఘర్షణలు, అనుభవాలు, అయోమయాలు….. అన్నీ ప్రాపంచిక జీవితానికి అన్వయింపబడి అగమ్యగోచరంగా, అలజడిగా అన్పించిన, ఎంతో అంతర్మధనం జరుగుతున్నా, ఇవన్నీ పారమార్ధిక జీవనంలో వైరాగ్యాన్ని, వివేకాన్ని, భక్తిని, పరమాత్మునిపై పరమప్రేమను పరిక్షించడానికి ఈశ్వరుడు పెట్టే పరిక్షలుగా భావించి సంకల్పమును చెదరనీయక, క్రుంగక, ప్రయత్నం వీడక ఫలితం ఆశించక, పయనం ఆపక, మరింత శ్రద్ధతో, పట్టుదలతో, సంయమనంతో, సమర్ధవంతంగా, ధీశాలిగా ముందుకు పోవడమే సరైన సాధన. బంగారానికి పుటం పెడితేగానీ ఆభరణం తయారుకాదు. పాత్రశుద్ధి ఉంటేగానీ పాలు కాచలేం. ఉలిదెబ్బలు పడితేగానీ విగ్రహం చేయడం కుదరదు. అలానే అనేక పరీక్షలు నెగ్గి సాధన చేస్తేగానీ అంతఃకరణ శుద్ధి కాదు. ఎవరికి వారే వారివారి సంస్కారముల ఆధారంగా సాధనామార్గంలను అనుష్టించి ఆత్మసాక్షాత్కారం కలిగేంతవరకు నిర్విరామ సాధన చేయాలి. అప్పుడే భవం నుండి భవ్యం వైపు వెళ్ళగలరు.
*సాధకులు*

త్రికరణశుద్ధిగా పై సాధనను ఆచరించినవారే సాధకులు. సదా సర్వప్రాణులను స్వాత్మ(తన ఆత్మ) యందు చూచునో, సర్వప్రాణులయందు ఆత్మను చూచునో వారే సాధకులు. అనంతుని స్మరణ, ఆధ్యాత్మికతత్వ అవగాహన, అన్యవిషయ విస్మరణ, అనన్య చింతన, ఆత్మ విచారణ, అంతా ఆత్మయేనన్నఅచంచల భావనలను అలవర్చుకొని, అవరోధాలను అధిగమిస్తూ ఆజన్మ సాధన అహర్నిశలు చేసేవారే నిజమైన సాధకులు. సత్కర్మలు, సదాచారణములు, సత్ శీలం , సత్ప్రవర్తన, సత్ వాక్కు, సన్మార్గం, సాత్వికాహారం, సమదృష్టి, సంయమనం, సందేహరహిత సాధన సాధకునికి అవసరం.

సత్ సంకల్పంతో, సద్గ్రంధంలు పఠనం శ్రవణం మననం చేస్తూ, సదా సత్యవస్తువుస్మరణ తోడుగా సద్గురువు సన్నిధిలో సాధన సక్రమంగా సాగించే సాధకునికి ఆత్మసాక్షాత్కారము సంప్రాప్తిస్తుంది.

🌻🌻🌻🌻🌻🌻🌻🌼🌼🌼🌼🌼🌼🌻

 

భగవాన్ శ్రీ రమణమహర్షి కృత ఉపదేశ సారము

భగవాన్ రమణులు, మొదటగా ఈ ఉపదేశ సారాన్ని ‘ ఉపదేశ ఉందియార్ ‘ అనే పేరుతో 30 పద్యములలో తమిళములో రచన చేశారు. తరువాత రమణులే, దాని భావమును పూర్తిగా తీసుకుని, సంస్కృతములో స్వయముగా ముప్పై లలితవృత్త గీతములు గాను, తెలుగులో ముప్పై ద్విపదలుగానూ, మళయాలంలో ముప్పై చతుష్పాద గీతములుగానూ రచించిరి.

ఇప్పుడు మనం ఆ సంస్కృత గీతముల ద్వారా స్థాలీ పులాక న్యాయముగా, రమణుల అనుగ్రహంతో, రోజుకు కొన్ని, మననం చేసుకుందాం.

మొదటి మూడు శ్లోకములు భగవద్గీతలోని ‘ కర్మయోగం ‘ గుర్తుకు తీసుకుని వస్తాయి.

1 . కర్తృరాజ్ఞయా ప్రాప్యతే ఫలం /
కర్మ కిమ్ పరం ? కర్మ తజ్జడం //

మానవులకు మూడు వివేకములు సాధారణంగా భగవంతుడు యిస్తాడు. అవి, లౌకిక వివేకము, ధార్మిక వివేకము, శ్రవణ వివేకము.

భగవదాజ్ఞానుసారము, కర్మఫలము లభించును. కర్మ దైవము కాదు. ఆలోచనలు కర్మలో భాగములే. భగవదాజ్ఞానుసారము వచ్చిన కర్మము దైవమెలా అవుతుంది ? కాదు అని అర్ధము. కానీ మీమాంసకారులు, ‘ కర్మవలన ప్రాప్టించే శుభాశుభములకు ఈశ్వరునికి ముడిపెట్టకూడదు. చేసిన కర్మయే స్వతంత్రముగా అలాంటి శుభాశుభ ఫలితాలని యిస్తుంది. ‘ అని అంటూ వుంటారు.

ఇక్కడ రమణులు మీమాంసకారుల అభిప్రాయాన్ని ఖండిస్తూ, కర్మము జడమైనది కనుక శుభాశుభఫలములు యివ్వడంలో, దానికి స్వతంత్రత లేదు, జడముగా వున్నది పరమాత్మ ఎలా అవుతుందీ, కాదు కనుక, ఈశ్వరుడే కర్మల యొక్క శుభాశుభ ఫలితాలనిస్తూ, జగత్తును నియంత్రిస్తూ వున్నాడని అర్ధం చెబుతున్నారు.

2 . కృతిమహోదధౌ పతనకారణం /
ఫలమశాశ్వతం గతినిరోధకం //

చేసిన కర్మలు మంచివి అయినా, చెడ్డవి అయినా వాని శుభాశుభ ఫలితాలు అశాశ్వతములు. కర్మఫలములు అయిపోగానే, తిరిగి జీవుడు కర్మ సముద్రములో పడవేయబడతాడు. అందువలన అది శాశ్వతగతి అయిన మోక్షాన్ని నిరోధిస్తుంది.

జీవులు పుణ్యకర్మల చేసివుంటే, ఆఫలములు స్వర్గాదిలోకాలలో అనుభవించి, పాపకర్మల చేసి వుంటే, వాటి ఫలములు నరకాది లోకములలో అనుభవించి, ఆ అనుభవ వాసనలనే, రాబోయే జన్మలలో వాసనాబీజములుగా తెచ్చుకుంటూ, జనన మరణ చక్రంలో పడుతున్నారు.

‘ కాబట్టి ఫలాపేక్షతో చేసే కర్మలు సుఖ దుఃఖాలను యిస్తాయి కానీ, మోక్షమును ఈయజాలవు. జీవులను కర్మసముద్రము నుండి వొడ్డున పడవేయవు. ‘ అని భగవాన్ చెబుతున్నారు.

 

ముక్తికి మార్గములు

ఈశావాశ్యోపనిషత్తు ఆధ్యాత్మిక సాధకులకు ముఖ్యంగా రెండు మార్గాలను చూపుతుంది. మొదటిది జ్ఞానమార్గాన్ని అనుసరించే వారికి – యజ్ఞాది కర్మలు చేయవలసిన పని లేదు. శాస్త్రాధ్యయనం , అత్మస్వరూపాన్ని గురించి మనన , నిదిధ్యాసనలను చేస్తుండాలి. అంటే జ్ఞాని సన్యాసితో సమానుడు.

ఇక రెండవ మార్గం – కోర్కెలను త్యజించి పైన చెప్పిన కఠినమైన జ్ఞానమార్గాన్ని అనుసరించే మానసిక యోగ్యత లేనివారికి ఇది చెప్పబడింది. భగవంతుడిని సాకారుడు గా ఆరాధించి అతని అనుగ్రహంచేత ఇహలో క సౌఖ్యాన్ని , మొక్షానందాన్నీ కోరేవారికి యజ్న యాగాది కర్మలు, శాస్త్ర విహిత కర్తవ్యాలను ఆచరిస్తూ వివిధ దేవతలను, పరబ్రహ్మాన్ని గూర్చిన , విజ్ఞానాన్ని ఆర్జించు కోవాలి. ఇట్టి సాధన ద్వారా వారు మరణా నంతరం స్వర్గాలోకాలలో అత్యున్నతమైన బ్రహ్మలోకం చేరుకుంటారు.

ఇలా జ్ఞాన మార్గము , కర్మమార్గమూ పరస్ప రం విరుద్దాలైన రెండు ప్రత్యేక మార్గాలని శ్రీ శంకరుల మౌలిక సిద్ధాంతం. ఎందుకంటే కర్మ, అహంబుద్దీ కామనలపై ఆధారపడి ఉంటుం ది. జ్ఞానం వాటి వినాశనంపై ఆధారపడి ఉంది. కామనాసహితంగా చేసే కర్మలు ఈలోకంలో గాని, స్వర్గలోకంలో గాని భోగాల ను పొందటానికి అర్హతను ఇస్తాయి.

కామనారహితంగా అంటే ఫలితాన్ని ఆశించక భగవదర్పణంగా చేస్తే అవి చిత్తశుద్ధికి దారి తీస్తాయి. జ్ఞానానికి , ఆత్మ సాక్షాత్కారానికి చిత్త శుద్ది అవసరం. చిత్తశుద్ధి కల్గిన తర్వాత కర్మావస్యకత లేదు. ఇక శాస్త్రోపదేశాలను విని వానిపై ధ్యాననిమగ్నుడు కావడమే అతని పని.దీనికి అవుసరమైన సామర్ధ్యాన్ని నిష్కామకర్మ ద్వారా మనస్సును పరిశుద్ధం చేసి సంపాదిస్తాడు. మనస్సు పరిశుద్ధ స్థాయిని చేరుకోనంత వరకూ భగవదార్పణ బుద్ధితో నిష్కామ కర్మ చేస్తూ ఉండవలసిన దే. ఇట్టివాడు క్రమంగా జ్ఞానాన్ని సంపాదిస్తా డు కాని ఈ ప్రపంచంలో మాత్రం కాదు. తన కర్మల , ఉపాసనల ఫలితంగా అత్యున్నతమై న స్వర్గానికి పోయి కల్పాంతం వరకు అక్కడ నివసించి అప్పుడు జ్ఞానాన్ని, మోక్షాన్ని పొందుతాడు. దీనినే క్రమ ముక్తి అంటారు. ఈ శరీరంతో ఉండేటపుడే మోక్షం పొందటా న్ని జీవన్ముక్తి అంటారు.

దుఖం : -కోరికలే ఆలోచనలుగా ఒకదాని వెంట మరొకటి వచ్చి, మనస్సుకు ఆరాటం కల్గిస్తాయి. దాంతో అసంతృప్తి వస్తుంది. అసంతృప్తి అనేది ముఖ్యంగా పరమాత్మతో మనం వేరవ్వడంవల్ల కల్గుతుంది. యాంత్రిక జీవనం, ఒంటరితనం,ప్రేమలేనితనం ఆత్మీయతకోసం తహతహ లాడటంవల్ల కల్గుతుంది. ఈ అసంతృప్తే ముక్తిమార్గానికి దారితీస్తుంది. దుఖమనేది శారీరకము , మానసికము , ఆధ్యాత్మికము అని మూడు విధాలు. శారీరకమైన దుఖమంటే , ఇది భౌతికమైనది . అనారోగ్య కారణాలవల్ల గాని , ఆర్ధిక సమస్యలవల్ల గాని కలిగే దుఖానుభవం . మానసిక దుఖమనేది భయమో, ప్రేమలేనితనంవల్లనో వస్తుంది. ఒక్కొక సారి కారణ మనేదే ఉండదు కూడా. ఆధ్యాత్మిక దుఖమనేది అసంతృప్తి వల్ల కల్గుతుంది. ఈ కారణాలను అల్లా ఉంచితే అసలు ఈప్రపంచంలోనే దుఖమనేది ఉంది. అంచేత అందరికీ ఎంతో కొంత దుఖానుభవం ఉండనే ఉంటుంది. కాకపోతే వారి దుఖాను భవాలలో హెచ్చు తగ్గులుంటుంటాయి. గుర్తుంచుకోవలసినది ఒక్కటే. ఎప్పుడూ మనం మోయలేనంతగా మాత్రం దుఖం ఉండదు. కాకపోతే ఎవరికి వారు అనుకునే ది , వాళ్ళే ఎక్కువ దుఖాన్ని అనుభవిస్తున్న ట్లు భావిస్తారు. ఇది వారి వారి భావనను బట్టి ఉంటుంది. వాస్తవానికి దుఖం సంఘట నలో ఉండదు. పరిస్థితిలోనూ లేదు. ఆ సంఘటన వల్ల మనస్సులో ఏర్పడ్డ భావంలో నే ఉంది. దీనికి కారణం మనకున్న అభిప్రా యమే. ఈ దుఖం పోవాలంటే మనకు ముక్తి రావాలి. దుఖంనుంచి దూరమవ్వాలంటే మన ఆలోచనా విధానం మారాలి. ముక్తి లభిస్తే దుఖం దూరమై , ఉన్నతమైన మానసి క స్థితిలో ఉండి అంతా సమానమే అనిపి స్తుంది. నా అనేదిగాని తనకు స్వంతమనేది గాని ఉండదు.

బాహ్యాంతర ప్రకృతినంతా నిరోధించి అంతర్గతంగా ఉండే దివ్యత్వాన్ని వ్యక్తం చెయ్యడమే జీవిత పరమావధి. దీనికోసం 1) భక్తి మార్గం .
2) జ్ఞాన మార్గం.
3) కర్మ మార్గం.
4) యోగ మార్గం అని ఉన్నాయి.
వీటిలో ఒకటి గాని , కొన్నిటిని గాని అవలంబించి ముక్తిని సాధించాలి. మోక్షం పొందగోరేవాడికి వాదాలు, సిద్ధాంతాలు, కర్మకలాపాలు, గ్రంధాలు, దేవాలయాలు , విధులు ఇవన్నీ అప్రధానాంశాలు . ఈ మార్గాలలో ఏ ఒక్కదానిలో ప్రావీణ్యత సంపాదించినా అది మిగిలిన వాటితో కలుస్తుంది. అంచేత ఎవరికి అనువైన మార్గాన్ని వారు ఎన్నుకొని సాధన చేస్తూ గమ్యాన్ని చేరవచ్చునని విజ్ఞులు చెబుతారు.